రాజమండ్రి సెంట్రల్ జైల్లో అసలేం జరుగుతోంది..? టీడీపీ అధినేత చంద్రబాబుకు లీగల్ ములాఖత్ ఎందుకు రద్దు చేశారు..? రాజమండ్రి జైల్లో చంద్రబాబు చేస్తున్న న్యాయ పోరాటంలో జాప్యానికి ఏదైనా కుట్ర జరుగుతోందా..? ఎన్నో ప్రశ్నలు.. పొంతనలేని సమాధానాలు..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన భద్రత విషయం, సౌకర్యాల కల్పన విషయంలో ఇప్పటికే అనేక అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు లీగల్ ములాఖత్ కూడా రద్దు చేశారు. రోజూ రెండు సార్లు లీగల్ ములాఖత్ కు అవకాశం ఉండగా, భద్రతా కారణాలతో జైలు అధికారులు ఈ ములాఖత్ ను రద్దు చేశారు. కేవలం ఒక్క ములాఖత్ మాత్రమే అనుమతిస్తూ ఆదేశాలు జరీ చేశారు.
లీగల్ ములాఖత్ కోసం చంద్రబాబు నాయుడు స్నేహ బ్లాక్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కు వచ్చేటప్పుడు మిగతా ఖైదీలు ఇబ్బందులు పడుతున్నారని.. భద్రతా పరమైన కారణాల వలన లీగల్ ములాఖత్ కుదించినట్టు లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా దాదాపుగా 2 వేల మంది ఖైదీలు ఉంటున్న ఈ జైల్లో ఖైదీలను కోర్టులో హాజరుపరచడంలో కూడా ఆలస్యం జరుగుతోందని ఇది కూడా ఒక కారణమని లేఖలో వివరించారు.
అయితే జైలు సిబ్బంది విడుదల చేసిన లేఖపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కావాలనే చంద్రబాబు నాయుడుకు లీగల్ ములాఖత్ రద్దు చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. ఐదు వారాలుగా లేని భద్రతా కారణాలు ఇప్పుడెందుకు చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు న్యాయ సహాయం అందకుండా ఉండేందుకే కుట్ర చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికే జైల్లో చంద్రబాబుకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. కనీసం అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి కూడా పంపలేదని గుర్తు చేస్తున్నారు.
రాజమండ్రి జైలు సిబ్బంది చంద్రబాబు విషయంలో ఇలా వ్యవహరిస్తుంటే.. అసలు జైలు లోపల ఏం జరుగుతోందని టీడీపీ సామాన్య కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. చంద్రబాబు ఎలా ఉన్నారో.. తెలియక కుటుంబ సభ్యులు సైతం మధనపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..